మోదీ ఈజ్ గ్రేట్..! వాహ్ క్యా బాత్ హై చంద్రబాబూ జీ..!!
చంద్రబాబు నాయుడు ఏ ఎండకాగొడుగు పడతారని చాలా మంది చెప్పుకునే మాటే. తన రాజకీయ ప్రయోజనాలకోసం ఎలాంటి పనైనా చేయడానికి చంద్రబాబు వెనకాడబోరని చెప్తుంటారు. ఆయన కూడా ఇలాగే వ్యవహరిస్తుంటారు. అధికారంకోసం ఎవరితోనైనా కలిసేందుకు వెనుకాడరు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కూడా పక్కన పెడుతుంటారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పోటీ చేశారు చంద్రబాబు. అందుకే చంద్రబాబును రాజకీయ ఊసరవెల్లి అని కూడా విమర్శిస్తుంటారు ప్రత్యర్థులు. కానీ చంద్రబాబు అలాంటి వాటిని పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ పోతుంటారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన మద్దతుతో ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. అప్పడు అధికారంలోకి రాగలిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. అయితే నాలుగేళ్లు ముగిసే సరికి బీజేపీతో కాపురం బెడిసికొట్టింది. ప్రత్యేక హోదా పేరుతో మోదీ ప్రభుత్వం నుంచి బయటికొచ్చారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తో కలిసి బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరిగారు. కానీ బొక్కబోర్లా పడ్డారు. ఏపీలో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. కానీ కేంద్రంలో మోదీ మళ్లీ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి చంద్రబాబు కామ్ అయిపోయారు. బీజేపీ ప్రాపకంకోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
మళ్లీ బీజేపీతో కలిసేందుకు, ఆ పార్టీతో పని చేసేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. కానీ కమలంపార్టీ నేతలు చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు. చంద్రబాబు అవకాశవాదాన్ని బాగా అర్థం చేసుకున్న బీజేపీ నేతలు.. ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే అవకాశం దొరికిన ప్రతిసారి బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది. టైమ్స్ నౌ చానల్ నిర్వహించిన ఓ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా మోదీ విధానాలను మెచ్చుకున్నారు. మోదీ వల్లే ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు లభించిందన్నారు. ఇలాగే పనిచేస్తే 2050 నాటికి భారత్ దే అగ్రస్థానమన్నారు చంద్రబాబు.
గత ఎన్నికల సమయంలో మోదీ ప్రభుత్వాన్ని, ఆయన విధానాలను భయంకరంగా తిట్టిపోశారు చంద్రబాబు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఇదే చంద్రబాబు గతంలో పెద్ద నోట్ల రద్దును స్వాగతించారు. ఆ తర్వాత మాట మార్చారు. ఇప్పుడు కూడా 500 నోట్ల కంటే పెద్ద నోట్లు అవసరం లేదని సలహా ఇచ్చారు. నాడు మోదీ విధానాలను తూర్పారబట్టిన చంద్రబాబు ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు. 2019లో తాను బీజేపీకి దూరం కావడం తప్పేనన్నారు. నేరుగా మోదీని కలిసి సారీ చెప్పాలనుకున్న చంద్రబాబుకు ఆ అవకాశం దొరక్కపోవడంతో.. ఇలా పరోక్షంగా తన ఆవేదనను వెలిబుచ్చారు.













