జనసేనను లైట్ తీసుకున్న బీజేపీ..! ఎవరిదారి వాళ్లదేనా?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలనేది బిజెపి ప్లాన్. ఇందుకోసం అన్ని దారులు వెతుకుతూ ఉంటుంది ఆ పార్టీ. నయానో భయానో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుతోనో లేకుంటే ఆ పార్టీలను తమలో కలుపుకొని బిజెపి అధికార పీఠాలను కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బిజెపి పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఏపీలోని అన్ని పార్టీలు బిజెపికి అనుకూలంగా ఉండడంతో కమలానికి తిరుగులేదు. కానీ సొంతంగా అధికారంలోకి రావాలనే తపన మాత్రం బిజెపికి కలగానే మిగిలిపోతుంది. అందుకే ఈసారి జనసేనతో కలిసి సత్తా చాటాలని పరితపిస్తోంది.
ఇన్నాళ్లు బిజెపి, జనసేన కలిసి పని చేస్తూ వచ్చాయి. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా, తామిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రెండు పార్టీల నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని.. అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. అయితే నేతలు ప్రకటిస్తున్నట్టుగా ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవని ఇటీవల కాలంలో తెలుస్తోంది. ఒకవైపు జనసేనను అధికార వైసిపి ఇబ్బందులు పడుతుంటే బిజెపి చూస్తూ ఊరుకుంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందని అర్థమవుతుంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కలిసి పని చేసేందుకు జనసేన దాదాపు రెడీ అయింది. రెండు పార్టీల నేతలు ఈ విషయంపై క్లారిటీకి వచ్చారు. కానీ బిజెపి నేతలు మాత్రం ఇప్పటికీ జనసేన తమతోనే ఉందని కలలు కంటున్నారు. అయితే జనసేన ను మాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. జనసేన బిజెపి కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ జనసేన ను పట్టించుకోకుండానే.. ఆ పార్టీని సంప్రదించకుండానే బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించేసింది.
తాజాగా బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన బిజెపి కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటే కన్నా లక్ష్మీనారాయణ కమలంలోనే కొనసాగాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బిజెపి ఒంటరిగా మిగిలిపోయింది. జనసేన టిడిపి తో జతకట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో బిజెపి లోనే ఉంటే తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని కన్నా లక్ష్మీనారాయణ భయపడ్డారు. అందుకే కమలాన్ని వీడి బయటపడ్డారు.
మొత్తానికి బిజెపి- జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఈ గ్యాప్ ను పూడ్చేందుకు బిజెపి చొరవ తీసుకోవాలి. కానీ బిజెపి తనను తాను ఎక్కువగా ఊహించుకుని జనసేన ను లైట్ తీసుకుంటుంది. దీంతో జనసేన తన దారి తాను చూసుకుంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం అనేది దాదాపు అసాధ్యం.













