అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..! రేపోమాపో అరెస్టు ఖాయమా..?
సుప్రీంకోర్టులో వై.ఎస్.అవినాశ్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయం అసాధారణంగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు గడువును జూన్ 30వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో ఏప్రిలో 30లోగా ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ ఈ కేసులో వేగం పెంచింది. అయితే సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అవినాశ్ రెడ్డి అరెస్టవుతారా.. అనే ఉత్కంఠ మళ్లీ పెరిగింది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ వై.ఎస్.అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారణకు చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అభిప్రాయపడింది. లిఖితపూర్వకంగా సీబీఐ ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలు అసంబద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇవి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి మార్గం సుగమమైంది. అయితే విచారణ సందర్భంగా అవినాశ్ ను అరెస్టు చేయాలనుకుంటే సీబీఐ ఎప్పుడో ఆరెస్టు చేసి ఉండేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో సీబీఐ ఎంతో సంయమనం పాటించిందని వెల్లడించింది. ఈ నెల 25వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటికి కాలం చెల్లింది. అవినాశ్ రెడ్డిని సీబీఐ రేపు విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు వివేకా హత్య కేసును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు సడలించింది. మరో 2 నెలలు పొడిగిస్తూ జూన్ 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సీబీఐకి ఈ విషయంలో కాస్త గడువు దొరికినట్లయింది. మరోవైపు ఇవాళ కూడా పులివెందులలో వివేకా నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు పర్యటించారు. ఆరోజు ఏం జరిగిందనేదానిపై ఆరా తీశారు. ఇప్పుడు అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై క్లారిటీ రావడంతో అరెస్టు ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.













