అరెస్టుకు భయపడే అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారా..?
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. ఇప్పుడు కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని లోతుగా ప్రశ్నిస్తోంది. రేపు అవినాశ్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. మరోవైపు 12న విచారణకు రావాలని అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య సంచలనం కలిగించింది. ఇది ప్రమాదం అని మొదట నమ్మించే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత దీన్ని అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు. అయితే వివేకా కుమార్తె సునీత ఇది హత్యేనని గట్టిగా వాదించడంతో ఇది సీబీఐ వరకూ వెళ్లింది. ఇన్నాళ్లూ కడప కేంద్రంగా సీబీఐ విచారణ జరిగింది. అయితే అక్కడ తమకు తగిన సహకారం లభించట్లేదని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు సునీత కూడా కేసును పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. దీంతో తెలంగాణకు ఈ కేసును బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జోరందుకుంది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురిని విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ. హత్యలో పాల్గొన్న నిందితులు హత్య జరగక ముందు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నారని సీబీఐ గుర్తించింది. దీనిపై అవినాశ్ రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించింది. రేపు మరోసారి విచారణకు రావాలని 160 సీఆర్పీసీ కింద నోటుసులు ఇచ్చింది. అయితే తనను ఇరికించే ప్రయత్నం సాగుతోందని.. ఒక కోణంలోనే సీబీఐ దీనిపై ఆరా తీస్తోందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. తాము చెప్పేవాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వీడియో తీయాలని, అలాగే 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినందున తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం తథ్యమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చిందని.. త్వరలోనే అవినాశ్ అరెస్ట్ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాశ్ వేసిన పిటిషన్ ఎలాంటి మలుపులకు కారణమవుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













