నేడో రేపో అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమా..?
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. రిమాండ్ కు తీసుకుని విచారిస్తోంది కూడా. అవినాశ్ రెడ్డిని కూడా ఇప్పటికే ఐదుసార్లు విచారించింది. అయితే అవినాశ్ రెడ్డి విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆయన్ను అరెస్టు చేస్తారేమోననే ఊహాగానాలు జోరుగా వినిపించేవి. అయితే ఎప్పటికప్పుడు ఆయన కోర్టును ఆశ్రయించి ఊరట పొందేవారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు రిలీఫ్ దొరకలేదు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట్లో రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో రెండోసారి రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించింది. పైగా బెయిల్ పిటిషన్ పై విచారణను జూన్ 5కా వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. వెకేషన్ బెంచ్ లో కూడా అవినాశ్ రెడ్డికి ఊరట లభించలేదు. దీంతో సీబీఐ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
అవసరమైతే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉంటుందని సీబీఐ ఇప్పటికే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇన్నాళ్లూ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అవినాశ్ ను అరెస్టు చేయలేకపోయింది సీబీఐ. ఇప్పుడు సీబీఐకి కోర్టుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. దీంతో అరెస్టుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే భాస్కర్ రెడ్డి, ఉదయ్, ఎర్రగంగిరెడ్డి లాంటి వాళ్లు సీబీఐ అదుపులో ఉన్నారు. అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేసి అందరినీ కలిపి విచారించాలని సీబీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే త్వరలోనే అవినాశ్ ను అరెస్టు చేస్తారని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.
హైదరాబాద్, కడప, పులివెందులలో సీబీఐ బృందాలు హడావుడి చేస్తున్నాయి. ఈ కేసులో ఎవర్ని ఎప్పుడు విచారిస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. శనివారం సీబీఐ బృందం కడప చేరుకుంది. దీంతో ఈసారి ఎవరిని అరెస్టు చేస్తుందోనని జిల్లాలో చర్చ మొదలైంది. అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమని వైసీపీ నేతలు కూడా నిర్ణయానికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అనుమానితులందరినీ సీబీఐ అరెస్టు చేసేసింది. ఇక మిగిలింది అవినాశ్ మాత్రమేనని సమాచారం. అందుకే ఆయన్ను కూడా ఈ దఫా అరెస్ట్ ఖాయమని భావిస్తున్నారు. అవినాశ్ అరెస్టు కాకుండా అడ్డుకునేందుకు జగన్ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదని సమాచారం.













