పనిచేసే ప్రభుత్వానికి ఎన్జీవోలు అండగా ఉందాలి L చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించి ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఎపీ ఎన్జీవో సంఘాల నేతలు. ఎపీ ఎన్జీవో, సెక్రటేరియెట్ అసోసియేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం.
విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం చారిత్రాత్మకం :
విభజన జరిగితే చాలా కష్టాలు వస్తాయని ముందుగా ఊహించి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించారు. 54 శాతం ఆదాయం తెలంగాణాకు వెళ్లి, 46 శాతం ఆదాయం మనకు వచ్చింది. అప్పులు మాత్రం జనాభా దామాషా ప్రకారం మనకు ఎక్కువగా వచ్చాయి. కుటుంబాల్ని చూడ్డానికి శని, ఆదివారాలు చాలునని చెప్పి, ఈ గడ్డపై పరిపాలన సాగించడానికి ఉద్యోగులు ఆనాడు ముందుకొచ్చారు.
ఒక్కోసారి నేను పని విషయంలో కొద్దిగా కష్టపెట్టినా మీరు శ్రమ అనుకోకుండా పనిచేశారు. నాలుగున్నరేళ్లలో మంచి ఫలితాలు సాధించామంటే అందుకు ప్రతి ఒక్కరూ శ్రమించబట్టే సాధ్యమయ్యింది. జల వనరుల శాఖలో ఈరోజు కూడా 6, 7 అవార్డులు వచ్చాయి. మొత్తం 670 అవార్డులు రాష్ట్రానికి దక్కాయంటే మనమంతా సంఘటితంగా కలిసి పనిచేయబట్టే సాధ్యం అయ్యింది.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులు చేస్తున్న శ్రమను గుర్తించి ఎప్పుడూ ఎవరూ ఇవ్వనంతగా 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించాను. రాజధానిలో మీ అందరికీ సొంతంగా ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల స్థలాలు అందించడానికి నిర్ణయాలు తీసుకుని కేటాయింపుల ప్రక్రియ కూడా పూర్తిచేశాం. సంపద పెంచాం. సమర్ధంగా పనిచేశాం. ఫలితాలు సాధించాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రం సహకరించి వుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించేవాళ్లం. వృద్ధులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సాధారణ ప్రజలు, పేద వర్గాలు.. ఇలా అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.
ఈరోజు మీ అందరితో నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను. మీపై ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నేను మీకు అండగా ఉన్నాను. ఇకపై కూడా అండగా ఉంటాను. మీకు ఎంతవరకు వీలయితే అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటారని విశ్వసిస్తున్నాను:సీయం చంద్రబాబు













