వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడంలో ఇబ్బందులేంటి? ఏపీ హైకోర్టు

కరోనా నియంత్రణ విషయంలో హైకోర్టు జగన్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతనే లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం ఆక్సిజన్ కొరత లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారని, ఇప్పుడేమో ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులు పేర్కొంటున్నారని ఆక్షేపించింది. కోవిడ్ వైద్య చికిత్సపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కోవిడ్ పరిస్థితి, సర్కార్ తీసుకుంటున్న చర్యలపై దాదాపు మూడు గంటల పాటు వానదలు జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఆక్సిజన్ లభ్యత, నోడల్ ఆఫీసర్ల పనితీరు, 104 కాల్ సెంటర్, వ్యాక్సినేషన్ పురోగతి అంశాలపై విచారణ జరిగింది.
ఈ అంశాల్లో ఏవైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దుకోవాలని హైకోర్టు జగన్ సర్కారుకు సూచించింది. అంతేకాకుండా ఆక్సిజన్ సరఫరాపై కూడా విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. సుదూరు ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి పొరుగునే ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఆక్సిజన్ వచ్చేలా చూడాలని కేంద్రానికి సూచించింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా అందరికీ వ్యాక్సిన్ వేయడంలో ప్రభుత్వం ముందున్న ఇబ్బందులేమిటో తమకు చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.