ఫ్లెక్సీల నిషేధంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
జనవరి 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్లెక్సీల నిషేధం అమలవుతుందని వైఎస్సార్సీపీ సర్కార్ కొద్ది నెలల క్రితం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకొక్క రోజులో ఈ ఫ్లెక్సీల నిషేధం అమలుకానుందనగా రాష్ట్ర హైకోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం వర్తిస్తుందంటూ ఈ రోజు(బుధవారం) తీర్పు వెలువరించింది. ఓవెన్ , పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేదం వర్తించదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
కాగా.. కొద్ది నెలల క్రితం విశాఖ వేదికగా ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ చేసుకునే క్రమంలో సీఎం జగన్ వన్ టైం యూజ్ ఫ్లెక్సీలను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎవరైనా ప్లెక్సీలు పెట్టాలనుకుంటే క్లాత్‌తో తయారు చేసినవి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే దీనిపై ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ మొదటినుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నిషేధాన్ని సవాలే చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే గత మూడు రోజులుగా బంద్ కూడా పాటిస్తున్నారు. ఇలాంటి సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు వారికి కొంత ఊరటనిచ్చాయనే చెప్పొచ్చు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.













