మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. ఆయన నివాసంలోనే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సాక్షిగా విచారణకు రావాలంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారు. అయితే ఈ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నారని, ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణకు 65 ఏళ్ల వయసు దాటిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం నారాయణను హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.













