వాలంటీర్లపై షాకింగ్ కామెంట్స్.. పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టనున్న ఏపీ సర్కార్!
ఏపీలో ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని గురువారం నాడు అధికారులు వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్ల విషయంలో పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కొన్నిరోజులుగా అధికార పార్టీ నాయకులు, జనసేన మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ పై కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 9న పవన్ మాట్లాడుతూ.. ఏపీలో 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారిలో కొంతమందిని మాత్రమే గుర్తించగా.. మిగతా వాళ్లు ఏమయ్యారో కూడా తెలియదని చెప్పారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్లనే ఇలా జరుగుతోందని ఆరోపించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐపీసీ సెక్షన్ 199/4 ప్రకారం కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్‌పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.













