రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై అవి కూడా..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చౌకధరల దుకాణాల్లో గోధుమ పిండిని కూడా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని విశాఖ వేదికగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వరరావు.. గురువారం నాడు స్వయంగా ప్రారంభించారు. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధరను రూ.16 గా నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కార్డుపై 2 కిలోల చొప్పున లభిస్తుందని, వినియోగదారులు పేద ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని.. ఒక్క విశాఖలోనే 4,54,485 కార్డుదారులకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. అతి త్వరలో మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీపై గోధుమపిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఏపీలో పేదలకు చిరుధాన్యాలను అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. UNO 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం, కేంద్రం కూడా వీటిని ప్రోత్సహిస్తుండడంతో వైసీపీ సర్కార్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రేషన్ కార్డుదారుల్లో ఎంతమంది వీటిని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని ఆరా తీస్తున్న సర్కార్.. అతి త్వరలో రేషన్ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఒక్కో రేషన్ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలనుకుంటోంది. అందుకే బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు ఇస్తే తీసుకుంటారా..? అనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.













