సింగపూర్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
అమరావతి బృహత్ ప్రణాళిక రూపకల్పన, స్టార్టప్ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో బంధాన్ని మరింత బలోపేతం దిశగా కీలక ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంపు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్ ప్రభుత్వం అందజేస్తుంది. ఎంవోయూలో భాగంగా ఏపీ ప్రభుత్వం సింగపూర్‌కు 1691 ఎకరాలు అందజేయనుంది. అమరావతి 6.84 చదరపు కిలోమీటర్ ప్రాంతాన్ని సింగపూర్ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది.
సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి అవగాహన ఒప్పందం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సింగపూర్ ప్రతినిధుల బృందం విజయవాడకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు గవ్నవరం విమానాశ్రయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు 60 మంది ప్రతినిధులకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.













