స్విమ్స్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వచ్చే ఐదేళ్లలో స్విమ్స్ దేశంలో నెంబర్ -1
ప్రజారోగ్యంలో హ్యాపీనెస్ తేవాలి
వ్యాధుల నిరోధానికి గ్రామాల దత్తత
వచ్చే ఏడాది నుంచి స్విమ్స్‌కు శాలరీ గ్రాంట్ బడ్జెట్
వచ్చే ఐదేళ్లలో స్విమ్స్ దేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న నెంబర్-1 సంస్థగా రూపొందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్న తమ కృషికి సహకారం అందజేయాలని, ప్రజారోగ్యంలో హ్యాపీనెస్ తీసుకురావాలని కోరారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) పాలకమండలి 18వ సమావేశంలో మాట్లాడుతూ వైద్యసేవలపై ప్రజల్లో పూర్తి సంతృప్తి తేవాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ప్రజారోగ్య పరిరక్షణకు కృషిచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఫలితాల సాధనకు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్ప కాలిక లక్ష్యాలతో పనిచేయాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి శాలరీ గ్రాంట్‌కు బడ్జెట్ ఇస్తామని, అందుకు అనుగుణంగా తదుపరి ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
టీటీడీ, స్విమ్స్ సమన్వయంతో పనిచేయాలని, సేవా పథకాల అమలులో మరింత సహకారం తీసుకోవాలని స్విమ్స్‌కు సీఎం సూచించారు. స్విమ్స్ లాంటి ఇతర సంస్థలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో తెలుసుకున్న ముఖ్యమంత్రి.. స్విమ్స్ స్వయం పోషకత్వం సాధించేందుకు కృషిచేయాలన్నారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఉత్తమ ప్రమాణాలు తేవాలని ఆదేశించారు. అన్నదానం ట్రస్టు తరహాలో అన్నక్యాంటీన్లకు విరాళాలిచ్చే దాతలను ప్రోత్సహించాలని, ఈ దిశగా తమకు కొన్ని సూచనలు చేయాలని సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ముఖ్యమంత్రి కోరారు. స్విమ్స్‌లో సేవాభావంతో చేపట్టిన పథకాలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకున్నారు.
స్విమ్స్ అభివృద్ధి కార్యక్రమాలపై స్విమ్స్ డైరెక్టర్-వైస్ చాన్సలర్ డా. టి.ఎస్. రవికుమార్ నివేదిక సమర్పిస్తూ నారావారిపల్లె సి.హెచ్.సిని స్విమ్స్‌కు అనుబంధ కేంద్రంగా చేయాలన్న ఆదేశాలకు సంబంధించి ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్నట్లు యి వేచిచూస్తున్నట్లు వైస్-ఛాన్స్లర్ తెలిపారు. 2018-19లో స్విమ్స్‌కు రూ.50 కోట్ల శాలరీ గ్రాంట్ ఇవ్వాలని వైస్-ఛాన్స్లర్ కోరగా వచ్చే ఏడాది నుంచి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, ఇందుకు తదుపరి చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. స్విమ్స్ లో అమలు చేస్తున్న ఆదిత్య హృదయం, ప్రివెంటివ్ కార్డియాలజీ కార్యక్రమ వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.
బ్రెస్ట్ క్యాన్సర్, నోటి కేన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే పింక్ బస్ స్ట్రాటజీని రూపొందించి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వైస్ ఛాన్సలర్ రవికుమార్ వివరించారు. ముందుగానే వ్యాధిని పసిగట్టి నిరోధించే దశలోనే నిరోధించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ మరణాలను 63%కు తగ్గించగలిగినట్లు చెప్పారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్విమ్స్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.













