అమిత్ షాకు సీఎం చంద్రబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్లాన్లు సింగపూర్‌లోనే ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూసీలు పంపలేదని కేంద్ర పెద్దలు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అమరావతి నిర్మాణ ప్లాన్లు ఎప్పుడో వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. 24 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో కొన్ని పనులు పూర్తి అవుతాయని తెలిపారు. యూసీలు సరైనవేనని నీతిఆయోగ్ కూడా చెప్పిందన్నారు. ప్రత్యేక హోదా, లోటుబడ్జెట్‌కు ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.
యూసీలు అడిగే అర్హత అమిత్ షాకి ఎక్కడిదని నిలదీశారు. యూసీల గురించి అడగాలనుకుంటే ప్రధాని అడగాలన్నారు. పాలనా వ్యవహారాల్లో బీజేపీ తలదూర్చడం సరికాదని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్‌కు ఎలా తరలిస్తారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లను వాడుకుంటూ టీడీపీపై దాడి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే ఒక్క శాతం ఓట్లు కూడా రావని పేర్కొన్నారు. 22 కోట్ల మంది సెల్ నెంబర్లు ఉంటే పాలనకు వినియోగించుకోవాలని కానీ బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలు సరికాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175 సీట్లు గెలవాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.













