విశాఖలో ఘనంగా ముగిసిన అగ్రిటెక్ సమ్మిట్-2017
రైతు సమస్యలకు పరిష్కారం చూపేలా, సాంకేతికతో సేద్యంలో నూతన పద్దతులు అవలంభించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసే ప్రధాన లక్ష్యంతో గత మూడు రోజులుగా విశాఖలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు (ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017) ముగిసింది. బుధవారం నాడు ఘనంగా ప్రారంభించిన ఈ వ్యవసాయ సంబరం రెండవ రోజైన పెద్దఎత్తున నిపుణులు, రైతులు, యువత కిక్కిరిసారు. ముగింపు సదస్సుకు ప్రపంచ కుబేరుడు, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఈ మూడు రోజుల సదస్సులో పలు చర్చలు జరిపి సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహకరం తీసుకోవాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సులో 259 కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, ప్రతిపాదనలు వచ్చాయి. 61 దేశాల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేరకు పలు విభిన్న రకాల వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలు, యంత్రాలు, విత్తనాలు లాంటివి ఇక్కడి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు.













