‘సీమ’ సిగలో మరో మణిహారం!
కర్నూలు జిల్లా వాసుల చిరకాల కల నెరవేరబోతోంది. జిల్లావాసులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఓర్వకల్లు విమానాశ్రయం రేపు ప్రారంభం కాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్, సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు కూడ ప్రారంభం కాబోతున్నాయి. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తొలి విమానం బెంగళూరు నుంచి రానుంది.
ఉడాన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. 153 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించారు. ఈ నెల 28 నుంచి ఇండిగో విమానం కర్నూలు- బెంగళూరు మధ్య సర్వీసులు ప్రారంభిస్తోంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమానాలు తిరిగేందుకు ఇండిగో అనుమతులు తీసుకుంది. బెంగళూరు-కర్నూలు, కర్నూలు-విశాఖపట్నం, కర్నూలు-చెన్నై మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు నడపనుంది.
ఓర్వకల్లు విమానాశ్రయం 20 ఏళ్ల కల. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓర్వకల్లు విమానాశ్రయానికి భూసేకరణ జరపాలని నిర్ణయించారు. అయితే ఆ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద వెయ్యి 8 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2019 జనవరి 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించారు. అయితే అప్పటికి రాకపోకలకు అనుమతులు రాలేదు.
జగన్ సీఎం అయ్యాక ఓర్వకల్లు విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులకోసం 75 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్ట్ పై DGCA సంతృప్తి వ్యక్తం చేయడంతో రాకపోకలకు అనుమతి ఇచ్చింది. దీంతో 28 నుంచి పూర్తిస్థాయి రాకపోకలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ సిద్ధమవుతోంది.













