మూడు రాజధానులకు పెద్దల సభ పెద్ద షాకే
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి విపక్షాలు ఎంతగా ప్రతిఘటించినా, ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా ఎంత తీవ్రస్థాయిలో నిరసనలు ప్రతిధ్వనిస్తున్నా మొండిగా ముందుకెళుతున్న అధికార పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో మాదిరిగానే, శాసనమండలి లోనూ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు లను ఆమోదింపజేసుకోవాలని విశ్వప్రయత్నం చేసిన వైకాపాకు పెద్దల సభ పెద్ద షాకే ఇచ్చింది. రోజంతా అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాల అనంతరం ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రకటించారు. ఈ హఠాత్పరిణామానికి వైకాపా ఎమ్మెల్సీలు, వారికి దన్నుగా మండలిలోనే మోహరించిన మంత్రులు నిర్ఘాంతపోయారు. ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా మండలిలో పట్టు నిలబెట్టుకున్నామన్న ఆనందంతో టీడీపీ ఎమ్మెల్సీలు సంబరాల్లో మునిగిపోయారు. అంతలోనే తమకు అనుకూలంగా నిర్ణయం రాలేదన్న ఆగ్రహంతో మంత్రులు, వైకాపా ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌పైకి దూసుకెళ్లడం, విపక్ష టీడీపీ సభ్యులు ప్రతిఘటించడంతో శాసనమండలి రణరంగాన్ని తలపించింది.













