చంద్రబాబుకు బిగ్ షాక్..!!
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఇరుక్కుని జైలుపాలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ సక్సెస్ కావట్లేదు. ప్రతి కోర్టులోనూ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాజాగా హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయన ఈ కేసులో విచారణ తప్పకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఇది కేసే కాదని.. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు చెప్తున్నారు. అందుకే కేసునే కొట్టేయాలని ఆయన పిటిషన్ వేశారు. అయితే దీన్ని కొట్టేయడంతో చంద్రబాబుకు షాక్ తగిలినట్లయింది.
స్కిల్ డెవలప్మెంట్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అప్పుడు రూ.370 కోట్లకు పైగా అవినీతి జరిగిందని.. ఆ నిధులు పక్కదారి పట్టాయని చెప్తోంది. దీనిపై నమోదైన కేసును విచారించిన అనంతరం.. అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమేయంతోనే నిధులు విడుదలయ్యాయని ఏపీ సీఐడీ గుర్తించింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. పది రోజులుగా చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు. ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అసలు అక్రమాలే జరగలేదని టీడీపీ వాదిస్తోంది. అప్పుడు ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పుడు కూడా పని చేస్తున్నాయని చెప్తోంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కూడా తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. విద్యార్థులు స్కిల్స్ నేర్చుకున్నప్పుడు, సెంటర్లు పని చేస్తున్నప్పుడు ఇక అవినీతి ఎక్కడ జరిగిందని టీడీపీ ప్రశ్నిస్తోంది. అందుకే ఈ కేసునే కొట్టివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో చంద్రబాబు ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండడం వల్ల ఏసీబీ కోర్టు బెయిల్ పైన, రిమాండ్ పిటిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తన తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు తదుపరి అడుగులు ఉండే అవకాశం ఉంది.













