రమేష్ ఆసుపత్రిపై చర్యలకు హైకోర్ట్ బ్రేక్…
విజయవాడలోని స్వర్ణప్యాలెస్ హోటల్లో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం విషయంలో ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు తన ఆదేశాలతో బ్రేక్ వేసింది. ఈ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేష్ ఆస్పత్రి ఎండీ, చైర్మన్ రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్వాపరాలివీ…
స్వర్ణప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ఈ నెల 9వ తేదీన సంభవించిన ఘోర అగ్నిప్రమాదం లో 10 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం రమేష్ ఆస్పత్రికి కోవిడ్ కేర్ సెంటర్ అనుమతులు రద్దు చేసి ఎండీ డాక్టర్ రమేష్ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉంది ఆసుపత్రి యాజమాన్యం. ఈ వ్యవహారంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్పై స్టే విధించిన హైకోర్టు ధర్మాసనం..
తాజా విచారణలో ఆ హోటల్లో ఏళ్ల తరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించింది. స్వర్ణ ప్యాలస్ హోటల్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో మరి ఈ ప్రమాదానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా దుర్ఘటనకు బాధ్యులే కదా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
చెక్కుల పంపిణీ..
స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంగళవారం ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల చెక్కులు పంపిణీ చేసింది. ఇది జరిగిన కొద్ది సేపటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలినట్టయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.













