ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవు.. కొత్తవి సృష్టించొద్దు
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని, కొత్తవి సృష్టించేందుకు ప్రయత్నించొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరికి వరదలు వచ్చినప్పుడు తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు నీట మునుగుతాయని వెల్లడిరచారు. తెలంగాణలో మీరు, ఏపీలో మేము పరిపానల చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. కొత్త వివాదాలు తీసుకురావొద్దన్నారు. నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చిందన్నారు. 7 మండలాలకు పోలవరం వల్ల ఇబ్బంది ఉంటుందనే వాటిని ఆంధ్రప్రదేశ్లో కలిపారు అని తెలిపారు.
భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుంది? అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు మంజూరు చేసిందన్నారు. మీరు 5 గ్రామాలు ఇవ్వమంటే.. భద్రచలం మాది అంటాం ఇస్తారా? అని ప్రశ్నించారు. 5 గ్రామాలు తెలంగాణకు కావాలంటే కేంద్రాన్ని అడగండి పోలవరం ఎత్తు విషయంలో సీడబ్ల్యూసీకి సమాచారం ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నాం. గోదావరి, కృష్ణా బోర్డులు ఉన్నాయి కదా. వాటిని సంప్రదించకుండా మాట్లాడితే ఎలా? భద్రాచలంలో కొత్తగా నీళ్లు రాలేదన్నారు. 1986లో 75 అడుగుల వరకు వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. పోలవరం వల్లే తెలంగాణ గ్రామాలు మునుగుతున్నాయా? అనేది సీడబ్ల్యూసీని తెలంగాణ అడగాలన్నారు. నిజం సమస్య ఉంటే ముఖ్యమంత్రులు ఉన్నారు కదా వారు చూసుకుంటారు అని అంబటి స్పష్టం చేశారు.













