విజయదశమికి పనులు ప్రారంభం : చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణ పనులను విజయదశమి (సెప్టెంబర్ 30న) రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, చంద్రశేఖర్ అండ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో 1350 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌కు సీఎం తుది ఆమోదం తెలిపారు. వాటిల్లో వివిధ నిర్మాణాలను ప్రారంభించేందుకు, పూర్తి చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించారు.
అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం (సింబల్ ఆఫ్ ఫ్రైడ్)గా, పోలవరం ప్రాజెక్టును ప్రగతి చిహ్నం (సింబల్ ఆప్ ప్రోగ్రెస్)గా ముఖ్యమంత్రి అభివర్ణించారు. అమరావతి పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను, వాటిల్లో ఐకానిక్ బిల్డింగులైన అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ డిజైన్లను ముఖ్యమంత్రి త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చూపుతారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రెండు నగరాల నిర్మాణ పనులను ఈ ఏడాది సెప్టెంబరు 30 అక్టోబరు 31 మధ్య ప్రారంభించి ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు.













