Allu Arjun: ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన అల్లు అర్జున్..!?
ఎక్కడో జరిగే ఓ సంఘటన మరెక్కడో ప్రభావం చూపిస్తుందని చాలాసార్లు వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. కొన్ని సంఘటనలు అలాగే ఉంటాయ్. యధాలాపంగా జరిగినవి ఏకు మేకై కూర్చుంటూ ఉంటాయి. ఆ పని చేస్తున్నప్పుడు అది అంత ప్రభావం చూపిస్తుందని అస్సలు ఊహించము. నాడు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఒక పని తన కుటుంబంలో చిచ్చుపెట్టే వరకూ వెళ్లింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని (AP Govt) ఇరకాటంలో పెట్టే స్థాయికి వచ్చింది. దీనిపై ఇటు కోర్టు, అటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది.
గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి (Silpa Ravichandra Reddy) మద్దతు తెలిపారు. అప్పుడు అల్లు అర్జున్ అభిమానులు (Allu Arjun Fans) భారీ ఎత్తున తరలివచ్చారు. భార్యతో కలిసి నంద్యాల (Nandyala) వెళ్లి అక్కడ హడావుడి చేశారు. తిరుపతి (Tirupati) వెళ్తూ మార్గమధ్యంలో స్నేహితుడి ఇంటికి వెళ్లానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉంది. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా జనసమీకరణ చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ పోలీసులు కేసు (police case) నమోదు చేశారు.
ఈ కేసును క్వాష్ (quash) చేయాలంటూ ఇప్పుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. మంగళవారం దీనిపై విచారణ జరపనుంది. అడిగిన వెంటనే ఏ కోర్టయినా కేసు కొట్టేయదు. కచ్చితంగా ప్రతివాదుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కేసులో కూడా పోలీసులు, ప్రభుత్వం నుంచి అభిప్రాయం చెప్పాలని కోరే వీలుంది. అదే జరిగితే పోలీసులు లేదా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది.
వైసీపీ నేతకు అల్లు అర్జున్ మద్దతు తెలిపారనే కారణంతో జనసైనికులు (janasainiks) ఆయన్ను వెలివేశారు. అల్లు – మెగా ఫ్యామిలీ (Allu – Mega Family) మధ్య కూడా గ్యాప్ బాగా పెరిగిపోయింది. నాగబాబు (Nagababu) నేరుగానే ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం (Deputy CM) అయ్యారు. చిరంజీవి (Chiranjeevi) సోదరుడు పవన్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. పాలు నీళ్లలా కలిసుండే అల్లు, మెగా ఫ్యామిలీలు అప్పుడు కూడా కనిపించలేదు. ఇప్పటికీ అల్లు అర్జున్ – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది.
ఇలాంటి సమయంలో కేసును కొట్టేయడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది అల్లు అర్జున్ కు పెద్ద దెబ్బ. పవన్ కల్యాణ్ ఇప్పటికీ అల్లు అర్జున్ పైన ఆగ్రహంగానే ఉన్నారని బన్నీ ఫ్యాన్స్ అనుకునే వీలుంటుంది. ఈ గ్యాప్ మరింత ముదిరి పాకానపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ ను క్షమిస్తే మాత్రం కేసును పెద్ద సీరియస్ గా పట్టించుకోకపోవచ్చు. అదే జరిగితే అల్లు అర్జున్ బయటపడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో ప్రభుత్వం/ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది.













