రాజధాని నిర్ణయం చంద్రబాబుది కాదు… 5 కోట్ల ఆంధ్రులది
అమరావతి ఉద్యమానికి 5 కోట్ల ఆంధ్రులు మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి రక్షణకై జనభేరి పేరుతో రాయపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అచ్చెన్నాయడు మాట్లాడుతూ ఏడాది గడిచినా అమరావతి ఉద్యమం ఆగలేదన్నారు. రాజధానిగా అమరావతి నిర్ణయం చంద్రబాబుది మాత్రమే కాదని, 5 కోట్ల ఆంధ్రులదని వివరించారు. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఆనాడు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రాజధాని కావాలని ఎవరైనా వైకాపా ప్రభుత్వాన్ని అడిగారా అని ప్రశ్నించారు. అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నించడం దారుణమన్నారు.













