30న తిరుపతిలో టీడీపీ భారీ సభ
ప్రత్యేక హోదా నినాదం హోరెత్తే విధంగా తిరుపతిలో ఈ నెల 30న అధికార తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 70 వేల నుంచి లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టి తిరుపతి సభను విజయవంతం చేయాలన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్ల పరిశీలనకు మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులతో పాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యతో కమిటీని ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లకు సంబంధించి మరికొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని సమాచారం. తిరుపతి సభతో శ్రీకారం చుట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సభలు నిర్వహించనున్నారు. తిరుపతి సభతో ప్రత్యేక హోదా జనంలోకి మరింతగా వెళ్లాలని, నాలుగేళ్లుగా ఏం జరిగింది? టీడీపీ ఏ విధంగా పోరాడుతోంది? అనే విషయాలను ఈ సభ ద్వారా తెలపాలని సూచించినట్లు సమాచారం.













