ఎన్నారైల నివాస హోదాపై ఐటీ కన్ను
పన్ను ఎగవేతదారులపై పట్టు బిగించిన కేంద్రం ప్రవాస భారతీయుల నివాస స్థాయి (రెసిడెన్షియల్ స్టేటస్)పైనా దృష్టి సారించింది. గత అయిదారేళ్ల పన్ను అసెస్మెంట్లు, పాస్పోర్టు ఫొటోకాపీలను పంపాలంటూ పలువురు ఎన్నారైలకు ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే నోటీసులు పంపింది. ఎవరైనా 182 రోజులకు మించి విదేశాల్లో ఉంటే ఎన్నారై హోదా లభిస్తుంది. ఎన్నారై అయితే మన దేశం వెలుపల వచ్చిన ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అదే స్థానికుడైతే విదేశాల్లో లభించిన ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు స్థానికులే అయినా ఎన్నారై హోదాలో చెలామణీ అవుతుండడంతో ఆదాయ పన్ను శాఖ నిఘా విభాగం దృష్టి సారించింది.













