విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్‌లో మే 3 వరకు టికెట్లు బుక్ చేసుకున్న విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థలు పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇవ్వనున్నాయి. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాన్సిలేషన్ చార్జీలను వసూలు చేయకుండా మొత్తం సొమ్మును వెనక్కి ఇవ్వాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. దేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించిన నేపథ్యంలో ఆయా సంస్థలు అప్పటి వరకు విమానాలను రద్దు చేశాయి. అయితే, క్యాన్సిల్ అయిన టికెట్లకు సంబంధించి నగదు రూపంలో రిఫండ్‌ను వెనక్కి ఇవ్వకూడదని నిర్ణయించాయి. నగదుకు బదులు క్రెడిట్ పాయింట్ల రూపంలో ఇస్తామని, వాటిని తర్వాతి ప్రయాణాల్లో టికెట్ల బుకింగ్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నాయి. ఎయిర్‌లైన్ సంస్థల నిర్ణయంతో విస్తుపోయిన ప్రయాణికులు పలువురు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన విమానాలకు సంబంధించి పూర్తి సొమ్మును నగదు రూపంలో వెనక్కి ఇవ్వాలని విమానయాన సంస్థలు ఆదేశించింది.













