పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష…
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2017లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబర్లో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. 2016 మార్చిలో ముషారఫ్ పాక్ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. న్యాయస్థానానికి రాలేదు. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ముషారఫ్ అనారోగ్య కారణాల రీత్యా దుబాయిలో చికిత్స తీసుకుంటున్నారు.













