చిన్నమ్మతో రాములమ్మ రహస్య భేటీ
అక్రమాస్తుల కేసులో జైలుపాలైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను రాములమ్మ విజయశాంతి పరామర్శించారు. పరప్పన ఆగ్రహారం జైలులో ఉన్న శశికళను విజయశాంతి వెళ్లి పరామర్శించారు. విజయశాంతి తన రాక విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచడం విశేషం. ఈ సమయంలో శశికళను ఓదార్చడంతో ధైర్యంగా ఉండాలంటూ విజయశాంతి సాంత్వన వచనాలు పలికినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. మొత్తం అరగంటకు పైగానే విజయశాంతి చిన్నమ్మతో చర్చలు జరిపారని సమాచారం. అనంతరం అక్కడే దినకరన్తోనూ చర్చించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా నిరాశలో ఉన్న తమ బృందానికి విజయశాంతి ఆశాజ్యోతిలా ఉపయోగపడతారని శశికళ, దినకరన్ గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం. విజయశాంతి సినిమాలకూ దూరమై చాలాకాలమైనా ఇప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ ఉంది. అందువల్ల కార్యకర్తలకు కట్టిపడేయడానికి విజయశాంతి మంచి ఆయుధంగా ఉపయోగపడతారని ఈ నేతలు భావిస్తున్నారు.













