శబరిమల ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం
కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. 10-50 మధ్య వయసు బాలికలు, మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సదరు దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భారత యువ న్యాయవాదుల సంఘం తదితర పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు వచ్చింది. దీనిపై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. పురుషుడు ఆలయంలోకి వెళ్లగలినప్పుడు, మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం పురుషులకు వర్తింపచేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.













