నవీన్బాబుకు ఎదురుందా..?
ఒడిశా ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి నవీన్ పట్నాయక్ బీజేడీ.. రాజకీయంగా చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బీజేడీకి ఎదురులేదని చెప్పొచ్చు. కాంగ్రెస్ చాలా చోట్ల ఉన్నా.. నామ్ కే వాస్తేలా పరిస్థితి ఉంది. బీజేపీ పరిస్థితి చూస్తే, నాయకులు నిల్, కేడర్ నిల్ అన్నట్లుగా మారింది. అయితే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేయడం, ఆపార్టీయే అధికారంలో ఉండడం మాత్రం కాస్త ప్రజావ్యతిరేకతకు దారితీయొచ్చు.
ప్రస్తుతానికి బీజేడీ బలంగా ఉన్నప్పటికీ.. నవీన్ పట్నాయక్ వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వారసులు కూడా లేరు. దీంతో ఈపరిణామాన్ని అనువుగా తీసుకుని.. బీజేడీని కబళిద్దామని కమలం పార్టీ తలచింది. పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిస్తూనే… ఎక్కువసీట్లు డిమాండ్ చేసింది. ఈ పరిణామాన్ని గుర్తించిన నవీన్ పట్నాయక్.. బీజేపీతో పొత్తును తిరస్కరించారు. ఒంటరిపోరుకే మొగ్గుచూపారు. ఫలితంగా ఒడిశాలో బీజేపీ ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది.
1998లో జనతా దళ్ పార్టీ ఎన్డీఏలో ఉండేది. బిజు పట్నాయక్ ఆ పార్టీకి సారధ్యం వహించేవారు. ఆయన అకాల మరణంతో నవీన్ పట్నాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటికే జనతాదళ్ పార్టీ ఎన్డీఏ లో ఉండడంతో.. వాజ్పేయి క్యాబినెట్లో నవీన్ పట్నాయక్ మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే తండ్రి బిజు పట్నాయక్ పేరిట.. బిజూ జనతాదళ్ పార్టీని నవీన్ స్థాపించారు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎం పీఠంపై నవీన్ కూర్చున్నారు. ఇప్పటివరకు అప్రతిహాసంగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో బాధపడుతున్నారు. ఆయన బ్రహ్మచారి కావడంతో.. రాజకీయ వారసులు సైతం లేరు.
అయితే నవీన్ పట్నాయక్.. స్వతహాగా నిజాయతీ పరుడు. ఒక్క అవినీతి ఆరోపణ లేని రాజకీయనాయకుడు. అంతేకాదు.. ఆయన మంత్రివర్గంలోనూ, ఎమ్మెల్యేల్లోనూ అవినీతి పరులు ఉండకుండా చూసుకుంటాడు. రాష్ట్ర బడ్జెట్ను బట్టి ముందుకెళ్తారు తప్ప, అప్పులు చేయడానికి ఇష్టపడరు. ఈ కారణాలన్నీ ఒడిశావాసులకు నవీన్బాబుపై ప్రేమాభిమానాలను పెంచాయి. అదెంతగా అంటే సీఎం అంటే నవీన్. నవీన్ అంటే సీఎం అనేంతగా.. నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతా దళ్ ఎన్డీఏకు నమ్మదగిన మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చింది. అయితే 2008, 2009లో జరిగిన మతపరమైన అల్లర్ల కారణంగా ఆ రెండు పార్టీలు విడిపోయాయి. ఈ హింసకాండ కు బిజెపి కారణమని చెప్పి బిజెడి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది.2009, 2014 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేసింది. కానీ మెరుగైన ఫలితాలు సాధించలేదు.













