Priyanka Gandhi : ప్రియాంకా గాంధీ ప్రధాని అవుతారా..?
ప్రియాంకా గాంధీ వాద్రా రాజకీయ ప్రవేశం, ఆమె ఎంపీగా సాధించిన విజయం, తాజాగా ఆమె భర్త రాబర్ట్ వాధ్రా చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. దశాబ్దాలుగా తెరవెనుక చక్రం తిప్పిన ప్రియాంక, ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవ్వడం కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాబర్ట్ వాధ్రా చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. “ప్రియాంక దేశ రాజకీయాల్లో ఉన్నత పదవిని చేపట్టే సమయం వస్తుంది, అది అనివార్యం” అని వ్యాఖ్యానించారు.
‘ఉన్నత పదవి’ అంటే దేశ ప్రధాని పదవి అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తన అమ్మమ్మ ఇందిరా గాంధీ పోలికలు, ఆమెలాగే స్పష్టంగా మాట్లాడే తీరు, ప్రజల్లోకి చొచ్చుకుపోయే గుణం ప్రియాంకను సహజంగానే ఒక పవర్ఫుల్ లీడర్‌గా నిలబెట్టాయి. వాధ్రా వ్యాఖ్యలు కేవలం ఒక కుటుంబ సభ్యుని మాటలుగా కాకుండా, కాంగ్రెస్ అంతర్గత వ్యూహంలో భాగంగానే బయటకు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్నప్పటికీ, ప్రధాని మోదీని, బీజేపీ బలమైన ఎన్నికల యంత్రాంగాన్ని ఢీకొట్టడంలో రాహుల్ ఎక్కడో ఒకచోట తడబడుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో బలంగా ఉంది. రాహుల్ గాంధీ సైద్ధాంతిక పోరాటం, పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసినా, ‘మాస్ లీడర్’ ఇమేజ్ తెచ్చుకోవడంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రియాంక గాంధీ భాషా పరిజ్ఞానం, ప్రత్యర్థులపై ఆమె చేసే పదునైన విమర్శలు, ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంలో ఆమె చూపే ప్రభావం రాహుల్ కంటే మిన్నగా ఉంటుందని పార్టీ శ్రేణుల నమ్మకం.
వయనాడ్ ఉప ఎన్నికలో ఆమె సాధించిన 4 లక్షలకు పైగా రికార్డు మెజారిటీ ఆమె పాపులారిటీకి నిదర్శనం. పార్లమెంటులో ఆమె చేసిన తొలి ప్రసంగమే అందరినీ ఆకట్టుకోవడంతో, రాహుల్ కంటే ప్రియాంకనే ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే పార్టీకి మైలేజీ ఉంటుందని గ్రౌండ్ లెవల్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకలో ఇందిరా గాంధీని చూసుకుంటారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన చొరవ, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీని గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చాయి. చాలా కాలం పాటు ‘కేవలం ప్రచారానికే పరిమితం’ అనే ముద్రను చెరిపేసి, ఇప్పుడు పూర్తిస్థాయి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడం ఆమె రాజకీయ ప్రస్థానంలో మలుపు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే ప్రియాంక ఫ్రంట్ ఫుట్ లో ఆడాలని వారు కోరుకుంటున్నారు.
ప్రియాంకకు ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నా, ఆమె ముందు కొన్ని క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను వారసత్వ రాజకీయాల పేరుతో టార్గెట్ చేస్తుంది. రాహుల్ తర్వాత మళ్ళీ ప్రియాంకను ముందుకు తెస్తే ఈ విమర్శలు ఇంకా తీవ్రమవుతాయి. సోదరుడు రాహుల్‌కు పోటీగా కాకుండా, ఆయనకు తోడుగా ఉంటూనే తన మార్క్ చూపించాల్సి ఉంటుంది. వాధ్రాపై ఉన్న వివాదాలు, విచారణలు ప్రియాంక రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారకుండా చూసుకోవడం సవాలుతో కూడుకున్న పని.
మొత్తానికి, రాబర్ట్ వాధ్రా మాటలు కాంగ్రెస్‌లో ఒక కొత్త చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీని తక్కువ చేయడం కాకపోయినా, ప్రియాంకను ఒక బ్రహ్మాస్త్రంలా వాడాలని పార్టీ భావిస్తోంది. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు అనుకూలిస్తే, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి మరో ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక పేరు వినిపించడం ఆశ్చర్యమేమీ కాదు.






