రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్ ఔట్..!
భారతీయ- అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ఏ మాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ ఈ ప్రకటన చేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతు ఉంటుందని చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ లో తొలిపోరు జరిగింది. దీనిలో ట్రంప్(51 శాతం ఓటింగ్) తొలి విజయం సాధించగా.. వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓటింగే వచ్చింది. ‘మేం ఆశించిన ఫలితాలను సాధించలేపోయామని భావిస్తున్నాను. మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాం. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గం లేదు’ అని ఈ ఫలితాల అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడుతూ వివేక్ ప్రకటించారు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. ఇమ్మిగ్రేషన్, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి, అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన.. ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు. ఈ ప్రైమరీ తొలి పోరు ముందువరకు ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే రెండురోజుల క్రితం అనూహ్యంగా వివేక్‌పై ట్రంప్ విమర్శలు చేశారు. తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని మాజీ అధ్యక్షుడి వర్గం వెల్లడించింది. ఈ తరుణంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ వెల్లడించారు.













