పెద్దన్న ఎవరివైపు..?
కెనడా-భారత్ మధ్య ఆధిపత్యపోరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో రెండింటికీ ఆప్తుడైన అగ్రరాజ్యం.. అమెరికా ఎవరిని సపోర్టు చేస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది. కెనడాతో అమెరికా బంధం.. దశాబ్దాల తరబడి పెనవేసుకుపోయింది. ఎంతలా అంటే కెనడాలో చదువు, శిక్షణ, పౌరసత్వం ఉంటే…అమెరికాలో ఉద్యోగం సహా అన్నింటికీ అర్హత వచ్చేసినట్లే. అందుకే చాలా మంది కెనడా వయా అమెరికా చేరుకుంటున్నారు. అంతే కాదు.. ఫైవ్ ఐస్ లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి నిఘా సమాచారం పరస్పరం పంచుకుంటాయి. అంతలా కలగలిసిన బంధం ఉన్న కెనడా వైపు అమెరికా మొగ్గు చూపుతుందా అన్న అనుమానాలున్నాయి.
మరోవైపు.. ఇటీవలి కాలంలో భారత్ ప్రభ అంతర్జాతీయంగా పెరుగుతోంది. ఇటీవలే జి-20ని సైతం విజయవంతంగా నిర్వహించింది. అతిపెద్ద మార్కెట్ లలో ఒకటి. సైనిక పరంగాను భారత్ శక్తిమంతంగా ఉంది. అణురంగంలో భారత్, అమెరికా మధ్య అత్యున్నతస్థాయి బంధం కొనసాగుతోంది. వచ్చే రిపబ్లికే డే ఉత్సవాలకు.. బైడెన్ ముఖ్య అతిధిగా వస్తున్నారు. దీనికి తోడు… అంతర్జాతీయంగా చైనాను నిలువరించాలంటే భారత్ సహకారం తప్పనిసరి అని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు తెలుసు. ఇప్పటికే చైనాతో అన్ని దేశాలకు తగాదాలున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ తో అనవసర విబేధాలను అమెరికా తెచ్చుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే అగ్రరాజ్యం అమెరికా .. ఈవిషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. సుదీర్ఘ బంధం ఉన్న కెనడాను, భారత్ తో మితృత్వాన్ని వదులుకునే పరిస్థితిలేదు. అందుకే.. కెనడా ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో వాటికి సహకరించాలని భారత్ కు తెలిపామని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కెనడాకు సైతం ఆధారాలు చూపాలని, అనవసరంగా ఆరోపణల గన్ పేల్చొద్దని సూచిస్తున్నట్లు సమాచారం. రెండు దేశాలతో తాము టచ్ లో ఉన్నామంటున్నాయి అమెరికన్ వర్గాలు.
మరోవైపు… భారత విదేశాంగమంత్రి జై శంకర్.. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఆయన అమెరికా అధికారులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసందర్బంగా జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో పలుకుబడి ఉన్న వారు.. వారి ప్రయోజనాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీంతో పాటే స్వేచ్చ ఎంత ముఖ్యమో.. మార్కెట్ సైతం అంతే ప్రధానమంటూ ట్రూడోకు అర్థమయ్యే రీతిలో పరోక్షంగా వెల్లడించారు.
అయితే నిజ్జర్ హత్యోదంతానికి ముందు.. సాక్షాత్తూ నిజ్జర్ సహా పలువురు ఖలిస్తానీ తీవ్రవాదులకు.. అమెరికా నుంచి సందేశాలు అందినట్లు సమాచారం. ఆ సమాచారం అందుకున్న తర్వాతే.. నిజ్జర్ హతమయ్యాడని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ వివాదానికి సంబంధించిన సమాచారం సైతం కెనడాతో అమెరికా పంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదంలో అమెరికా ఎవరి పక్షాన నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.













