‘ఇజ్రాయెల్’ ఒంటరవుతోందా..?
హమాస్ ఏరివేత పేరుతో గాజాపై భీకరదాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తీరుపై.. ప్రపంచదేశాల నుంచి నిరసన పోటెత్తుతోంది. భూతల దాడులు మొదలైనప్పటి నుంచి హమాస్ మిలిటెంట్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండగా.. మరోవైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ మంగళవారం గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలను తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్దతు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు…ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరోచోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు.
అగ్రరాజ్యం స్వరంలో మార్పు..
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు గట్టిగా మద్దతు పలుకుతూ వస్తున్న అమెరికా మాట తీరులో మార్పు వస్తోంది. విచక్షణా రహిత బాంబు దాడులతో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోవాల్సి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే మంగళవారం ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి డిమాండు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే బైడెన్ స్పందించారు. ‘ఇజ్రాయెల్ తన భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడొచ్చు. కానీ ఇప్పుడు అమెరికా కంటే కూడా మిగిలినవారి మద్దతు ఆ దేశానికుంది. యూరప్ దేశాలన్నీ వెంట నిలుస్తున్నాయి. కానీ ఆ మద్దతును ఇజ్రాయెల్ క్రమంగా కోల్పోతోంది’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రధాని నెతన్యాహు దీనిని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని, కానీ ఆ దేశ వార్ కేబినెట్ స్పందిస్తుందనుకోవడం లేదని పేర్కొన్నారు. ఇళ్లలోనే గాజా ప్రజలను ఉంచి దాడులు చేయడంద్వారా అణచివేయడాన్ని ఆపాలని సూచించారు. 2001 సెప్టెంబరు 11న తమపై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత తాము అతిగా స్పందించి తప్పులు చేసినట్లుగా ఇప్పుడు ఇజ్రాయెల్ చేయొద్దని హితవు పలికారు.
ఇప్పటికే అరబ్ ప్రపంచం.. గాజాపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమాయక గాజావాసుల ప్రాణాలను అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ తీస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే టర్కీ, ఇరాన్, యూఏఈ సహా పలు దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడితో.. అమెరికాకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకూ అరబ్ ప్రపంచంతో సఖ్యత ఏర్పరచుకుంటూ అమెరికా ముందుకెళ్తోంది. ఈ దాడితో ఆ సంబంధాలు సైతంప్రమాదంలో పడ్డాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు…గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలనే డిమాండుతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. బేషరతుగా బందీలనూ విడుదల చేయాలని తీర్మానం కోరింది. మంగళవారం అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఐరాస నిర్వహించింది. అందులో ఈ తీర్మానం ప్రవేశపెట్టగా అద్భుత స్పందన వచ్చింది. తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు ఓటేశాయి. 10 దేశాలు వ్యతిరేకించాయి. 23 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఆస్ట్రియా వ్యతిరేకంగా ఓటేసిన దేశాల్లో ఉన్నాయి. జర్మనీ, హంగరీ, ఇటలీ, ఉక్రెయిన్, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానాన్ని ఈజిప్టు ప్రవేశపెట్టింది.













