White House: అంతర్జాతీయ ప్రపంచానికి ట్రంప్ మరో అల్టిమేటం..

అమెరికా వాణిజ్యం విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరో అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సుంకాలు కాకుండా ఇతర రూపంలో అమెరికాను దెబ్బతీసే ఎనిమిది పాయింట్ల(8 points) ను వెల్లడించి.. ఏదైనా దేశం వాటిని అనుసరిస్తున్నట్లు బయటపడితే తమ దేశంతో సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇప్పటికే ప్రపంచదేశాలపై ప్రతీకార సుంకాలను విధించి.. ఒక్క చైనా మినహా మిగిలిన వాటికి 90 రోజుల ఉపశమనం కల్పించారు ట్రంప్.
ట్రంప్ 8 పాయింట్లు..
కరెన్సీ మేనిప్యులేషన్(currency manipulation): చాలా దేశాలు తమ వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా విక్రయించేందుకు కరెన్సీ విలువలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తాయి. గతంలో అమెరికా ఇలాంటి దేశాల జాబితాలను కూడా తయారుచేసింది.
వ్యాట్ (vat): కొన్ని దేశాల ఉత్పత్తులపై వ్యాట్ విధిస్తాయి. కానీ, దిగుమతులపై వాటిని కొనసాగించినా.. ఎగుమతులపై ఆ సొమ్మును రీఫండ్ చేస్తుంటాయి. అలాంటి చర్యలు సహించమన్నారు.
తక్కువ రేటుకు డంపింగ్ చేయడాన్ని కూడా ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. చైనా వంటి భారీ ఉత్పాదక దేశాలు.. కారు చౌకగా వస్తువులు తయారుచేసి ఇతర దేశాల్లో డంపింగ్ చేస్తాయి. దీంతో ఆయా దేశాల్లో స్థానిక పరిశ్రమలు మూతపడతాయి.
రాయితీలపై..
ఎగుమతులపై ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడాన్ని కూడా ట్రంప్ తప్పుపట్టారు.
వ్యవసాయరంగంలో దేశీయ రైతుల కోసం రక్షణాత్మక రాయితీలు కూడా ఇవ్వకూడదని పేర్కొన్నారు.
ఇవికాకుండా నకిలీల తయారీ, మేధో హక్కుల అపహరణ, అమెరికా టారిఫ్‌లను తప్పించుకోవడానికి మరో దేశం నుంచి ఎగుమతి చేయడం వంటివి కూడా ఉపేక్షించమన్నారు.
బౌలింగ్ బాల్ టెస్ట్..
ఇక ప్రత్యేకంగా జపాన్ నిర్వహించే ఓ పరీక్షను కూడా ట్రంప్ తప్పుట్టారు. దేశీయ సంస్థలను కాపాడేందుకు రక్షణాత్మక సాంకేతిక ప్రమాణాలను ఏర్పాటు చేయకూడదన్నారు. దీనికిగాను జపాన్ నిర్వహించే బౌలింగ్ బాల్ టెస్ట్(Bowling ball) ను ఉదహరించారు. ఈ పరీక్షను జపాన్ 2018లో ప్రవేశపెట్టింది. విదేశీ కార్లు.. తమ దేశంలో విక్రయించకుండా చూసేందుకు దీనిని మొదలుపెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరీక్షలు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి బౌలింగ్ బాల్‌ను కారు హుడ్‌పై వదులతారు. అప్పుడు దానికి సొట్ట (డెంట్) పడకపోతే అది పరీక్షలో విజయం సాధించినట్లు భావిస్తారు. ఇదో భయంకరమైన పరీక్షగా ట్రంప్ అభివర్ణించారు.