టార్గెట్ కేసీఆర్..
టార్గెట్ కేసీఆర్ ..ఆపరేషన్ స్టార్టైందా? కవిత అరెస్టుకు రంగం సిద్దమైందా? భోపాల్ లో కేసీఆర్ కుటుంబంపై మోడీ వ్యాఖ్యల వెనక మర్మమిదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఈ సమావేశంలో కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించిన మోదీ.. ములాయం సింగ్, లాలూ, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి ఇలా ప్రముఖ నేతలను విమర్శించారు. కాగా.. చివరిలో కేసీఆర్, కవిత గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. కేసీఆర్ కూతురుకు మేలు చేయాలంటే బీఆర్ఎస్కు ఓటేయండని వ్యాఖ్యానించారు. మీ పిల్లలు, మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ సూచించారు.
లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినెవ్వరినీ వదిలిపెట్టనని మోదీ సంకేతాలిచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ అరెస్టయ్యారు. నేడో,రేపో కేజ్రీవాల్ ఆరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కవిత అరెస్టు తప్పదన్న సంకేతాన్ని మోదీ పంపించారని.. అందుకే మోదీ నోట కవిత మాట వినిపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే హస్తినలో అమిత్ షా, నడ్డాలతో పాటు బీజేపీ పెద్దలను కలిసిన ఈటల, రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిందనని తేల్చి చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం.. ప్రజల్లోకి బలంగా వెళ్తోందని.. లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాదు.. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బీజేపీకి మేలు జరుగుతుందని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ హైకమాండ్ , కేసీఆర్ పట్ల వ్యహరిస్తున్న తీరుతో వీరు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.అయితే దాన్ని వీరు తోసిపుచ్చారు.
ఇప్పటికే కేటీఆర్.. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అమిత్ షాతో భేటీ క్యాన్సిల్ అయింది కానీ.. మిగిలిన వారితో సమావేశమయ్యారు. ఇది ఇరు ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలపై జరిగిన సాదారణ వ్యవహారంగా చెబుతున్నా…ఇందులో లిక్కర్ కేసుకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే సరైన హామీ లభించకపోవడంతోనే కేటీఆర్.. నడ్డా, ఇతర బీజేపీ నేతలపై గట్టిగా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. అందుకే కవిత పేరును ఛార్జ్ షీట్లలో పలుమార్లు ప్రస్తావించినా.. ఇప్పటికీ అరెస్ట్ చేయట్లేదంటూ ఆక్షేపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని సాగిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సైతం.. ఆరెండు పార్టీలు ఒక్కటేనని గట్టిగా చెబుతున్నారు. బీజేపికి అవసరమైనప్పుడు కేసీఆర్ సాయం చేస్తున్నారని.. అందుకే కవిత విషయంలో బీజేపీ సైలెంటైందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.













