‘పన్నూ’ హత్య కుట్రకేసు విచారణ…
ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకుట్ర కేసు విషయంపై అగ్రరాజ్యం ఫోకస్ పెట్టింది. తమ దేశంలో తమ పౌరసత్వం కలిగిన గురు పత్వంత్ సింగ్ పన్నును హత్య చేసేందుకు ఓ భారతీయుడు కుట్రపన్నారని.. అమెరికా విచారణ విభాగం ప్రకటించింది. అంతేకాదు.. దీనికి సంబంధించి భారత్ పై ఒత్తిడి సైతం తెస్తోంది. అగ్రరాజ్యంతో సంబంధాల ఆవశ్యకతను గుర్తించిన భారత్.. దీనిపై స్పందించింది. పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని భారత్ ప్రకటించింది.
భారత్ తీసుకున్న నిర్ణయం ‘మంచిది, సముచితమైనది’ అని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా మాలో చాలా మంది ఈ అంశాన్ని నేరుగా భారత ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు’’ అని పేర్కొన్నారు.
మరోవైపు…గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ అధిపతిని భారత్కు పంపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ ఆగస్టులో భారత్కు వచ్చినట్లు పేర్కొంది. పన్నూ హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బర్న్స్ పర్యటన జరిగిందని తెలిపింది. మరోవైపు ఆగస్టులో భారత్ వచ్చిన విలియం బర్న్స్.. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ) అధిపతి రవి సిన్హాతో భేటీ అయినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరమని.. అందుకు భారత్ సహకరించాలని ఆయన కోరినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్ నుంచి అమెరికా స్పష్టమైన హామీ కోరినట్లు సమాచారం. పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని గురువారం శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వ్యాఖ్యానించారు.
భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకునే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తామని కిర్సీ తెలిపారు.‘‘భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. ఆ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా మా చర్యలుంటాయి. అలాగే అమెరికాలో హత్యకు జరిగిన కుట్రను, ఆ కేసు దర్యాప్తును తీవ్రంగా పరిగణిస్తాం. ఈ కేసును భారత్ కూడా తీవ్రంగా పరిగణించడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.













