హిమాలయాల్లో డెత్ జోన్ ..?

ఎవరెస్ట్ మనిషికి ఆలోచనా శక్తి పెరిగిన దగ్గర నుంచి ఊరిస్తూ వచ్చిన మహా శిఖరం. దాన్ని అధిగమించి, తమ సత్తా చాటాలని తలవని మనిషంటూ ఉండడంటే అతిశయోక్తి కాదు. కానీ అక్కడి వరకూ వెళ్లాలంటే చాలా వ్యయప్రయాసలకోర్చి ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి డబ్బు, ఔత్సాహికుల అండ, ప్రభుత్వ ప్రోత్సాహం, అనుమతి అవసరం. అందుకే అతికొద్ది మంది మాత్రమే ఎవరెస్ట్ అధిరోహించేందుకు మక్కువ చూపుతుంటారు. ఇలాంటివారికి భారత్, నేపాల్, చైనా తమ దేశాల గుండా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తుంటాయి.
హిమాలయాల్లో ప్రయాణమంటే మాటలు కాదు.. మృత్యుదారుల గుండా ప్రయాణించడమే. అందుకే అక్కడకు వెళ్లే పర్యాటకులు.. నేపాలీ గైడ్స్ ను వెంట పెట్టుకుని అధిరోహణం చేస్తుంటారు. ఎందుకంటే నేపాలీ షెర్పాలకు .. హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్టు కొట్టిన పిండని చెప్పవచ్చు. అక్కడి వాతావరణం వారికి కొత్త కాకపోవడం, చాలా మంది పర్వతారోహకులతో కలిసి శిఖరాలు అధిరోహించడం ద్వారా.. వారు ఆ గడ్డు పరిస్థితులను సునాయాసంగా అధిగమిస్తుంటారు.
అయితే హిమాలయాలు, మరీ ముఖ్యంగా ఎవరెస్టు అధిగమించే సమయంలో పర్యాటకులు చాాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం, ఒక్కసారిగా విరుచుకుపడే మంచుతుపాన్లు, విరిగిపడే హిమశిఖరాలు… వీటన్నింటినీ అధిగమించి ఆ మహాపర్వత శిఖరంపై కాలు పెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో చాలా మంది పర్వతారోహకులు.. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది డెత్ జోన్ లోనే చనిపోతున్నారు.
ఇంతకూ డెత్ జోన్ అంటే..
ఎవరెస్టు పర్వతారోహణ క్రమంలో సంభవించే మరణాలన్నీ 8వేల మీటర్ల ఎత్తు పరిధిలోనే నమోదవుతున్నాయి. దీన్నే ‘డెత్ జోన్’గా పరిగణిస్తారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణం వంటివి అనారోగ్యం ముప్పును పెంచుతాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతోపాటు పర్వతాల్లో జారిపడటం వంటివీ చోటుచేసుకుంటాయి. ప్రపంచంలో ఎత్తైన తొలి పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి.
ఈ ఏడాది దాదాపు 900 మంది ఔత్సాహిక పర్వతారోహకులకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీరిలో 419 మంది ఎవరెస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనేకమంది పర్వతారోహకులు, షెర్పాలు ఇప్పటికే శిఖరాన్ని అధిరోహించినట్లు సమాచారం. మరోవైపు అటు చైనా కూడా టిబెట్ మార్గం నుంచి ఈ ఏడాది అనుమతులు ఇస్తోంది.