అమెరికా ‘ద్వంద్వ’ నీతి..
ఖలిస్తాన్ ఉగ్రవాద నేతల విషయంలో అమెరికా ద్వంద్వ నీతి పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కెనడాలో నిజ్జర్ హత్యఘటనను.. ప్రదాని ట్రూడో నేరుగా ప్రస్తావించారు. భారత్ హస్తముందని ఘాటు విమర్శలే చేశారు. దీనిపై భారత్ సైతం ధీటుగా స్పందించింది. అనవసర ఆరోపణలు మాని, వివరాలు తమతో పంచుకోవాలని కోరింది. అయితే ఇప్పటివరకూ తమకు వివరాలు ఇవ్వలేదని ఆక్షేపించింది. అయితే ఇటీవల అమెరికాలో ఖలిస్తానీ నేత పన్ను హత్యకు కుట్ర జరిగిందంటూ.. ఆదేశ రక్షణ ఏజెన్సీలు ఆరోపించాయి. అయితే దీనిపై అమెరికా ఫోకస్ పెట్టింది.
భారత్ తమకు సహకరించాలని ఓ రకంగా చెప్పాలంటే దౌత్యపరిభాషలో ఆదేశాలు జారీ చేసిందని చెప్పక తప్పదు. తొలుత గట్టిగానే మాట్లాడిన భారత్.. తర్వాత అగ్రరాజ్యంతో సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. అంతే కాదు… ఉగ్రఘటనలు తమకు ఆమోగయోగ్యం కాదని వెల్లడించింది. కేవలం అమెరికాతో సంబంధాలను దృష్టిలో పెట్టుకుని.. మోడీ సర్కార్ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు రుజువైతే పరిస్థితి ఏంటి..? ఎవరు బాధ్యత వహిస్తారు..? ఎలాంటి పరిణామాలు ఎదురవ్వనున్నాయి…? ఇప్పుడిదే అంశంపై దౌత్యవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక తమదేశంలో ఓ వ్యక్తి హత్యకు కుట్ర జరగడం అమెరికాకు ఆమోదయోగ్యం కాదు.. కానీ తమ దేశంలో ఉంటూ మిత్రదేశంలో విద్వేషాగ్నిని కొందరు వ్యక్తులు రగిలిస్తూ ఉండడం మాత్రం ఆమోదయోగ్యమవుతుందా..? ఆ వ్యక్తులు….నేరుగా భారత ప్రధాని, ఇతర మంత్రులకు హెచ్చరికలు జారీ చేయడం సమంజసంగా ఉంటుందా..? ఎయిరిండియా అనే విమానయాన సంస్థను ఎక్కొద్దని.. భారతీయులకు హెచ్చరికలు జారీచేయడం కరెక్టేనా..? అంటే .. తమదేశంలో ఉన్న వ్యక్తి.. ఏదేనా చేయవచ్చా…? వారికి రూల్స్ వర్తించవా…? వీటికి అగ్రరాజ్యం దగ్గర సమాధానముందా..? ఇక భారత ప్రభుత్వం సైతం… ఇదే విషయాన్ని అమెరికా దగ్గర ప్రస్తావించిందా..? అమెరికాలో ఉంటే ఉండవచ్చు గాక…అంత మాత్రాన ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే అధికారం వారికి లేదన్న విషయాన్ని చెప్పిందా….? అలాంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత అమెరికాదే అన్న విషయాన్ని దౌత్యమార్గాల ద్వారా స్పష్టం చేసిందా…? మరోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదన్న సంగతిని.. అగ్రరాజ్యాదినేతల ఎదుట వ్యక్తం చేసిందా..? ఇవన్నీ చేయకుంటే మాత్రం భారత్.. అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు భావించాల్సి ఉంటుందని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.
పన్ను హత్య కుట్రకేసుకు సంబంధించి కమిటీ వేయడం విషయంలో భారత్ ఎంత చిత్తశుద్ధి కనబరిచిందో.. అమెరికాపై ఒత్తిడి తేవడంలోనూ అంతే సమర్థంగా వ్యవహరించాల్సి ఉంది. మిత్రపక్షమంటే.. బానిస పక్షం కాదన్న సంగతి అగ్రరాజ్యం గుర్తెరిగేలా చూసుకోవాల్సి ఉంది. మోడీ సర్కార్ సైతం…భారత ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గరాదన్న విషయాన్ని సదా మనసులో ఉంచుకోవాల్సిన సమయమిది.













