గుణ’పాఠమే’..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి.. మిత్రదేశానికి ప్రాప్తకాలజ్ఞత గురించి వివరించారు. ఆవేశంలో అతిగా రియాక్టైతే, తర్వాత చింతించాల్సి ఉంటుందని మరోసారి సూచించారు. గతంలో తాము ఆఫ్గనిస్తాన్ లో 20 ఏళ్లు ఉండి చేసిన పొరపాటును గాజా విషయంలో ఇజ్రాయెల్ చేయొద్దని.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు అంటే .. గాజా గ్రౌండ్ ఆపరేషన్ పూర్తి చేసి, వెనక్కు వెళ్లిపోవాలని పెద్దన్నగా హితబోధ చేశారని చెప్పుకోవచ్చు.
తాను ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో.. 9/11 దుర్ఘటన వల్ల అమెరికా అనుభవించిన నరకాన్ని వెల్లడించానన్నారు బైడెన్. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని తెలియజేశాను. ఆ వేళ మేం న్యాయం కోసం ఆవేశంగా వెళ్లి తప్పులు చేశాం. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో కళ్లుమూసుకుపోవద్దని.. ఆలోచించి అడుగులు వేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచిస్తున్నాను ’ అని బైడెన్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం తెలిపింది.
సెప్టెంబర్ 11, 2001లో అల్‌ఖైదా ఉగ్రసంస్థ అమెరికాలోని ప్రభుత్వ, వాణిజ్య కేంద్రాలపై దాడులు చేసింది. ఆ దుర్ఘటనలో మూడువేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితోనే అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. ఈ దాడులకు సూత్రధారి, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను ఉత్తర పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించిన అమెరికా.. 2011లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అంతం చేసింది.
అమెరికాలో ఉగ్రదాడి అనంతరం అఫ్గానిస్థాన్‌లో సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం.. అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ క్రమంలో సుదీర్ఘకాలం అంటే సుమారు 20 ఏళ్లపాటు ఆ దేశంలో బలగాలను కొనసాగించాల్సి వచ్చింది. ఫలితంగా వేలాది మంది సైనికుల ప్రాణాలను అమెరికా పణంగా పెట్టింది. కోట్లాది రూపాయల విలువైన ఆయుధాలు, డబ్బు.. ఈ ఆపరేషన్ కోసం వినియోగించాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు అమెరికా బలగాలు ఖాళీ చేసిన తర్వాత ఆప్రాంతం.. తాలిబన్ల వశమైంది. దీంతో ఇన్నాళ్ల తమ శ్రమ వృధా అయిందన్న సూచన బైడెన్ మాటల్లో వ్యక్తమవుతోంది. తమలాగే ఇజ్రాయెల్ కూడా గాజాలో ఇరుక్కుపోవద్దనే ఉద్దేశంతో ఈ హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోంది.
గురువారం రాత్రి ఓవల్ ఆఫీస్ నుంచి బైడెన్ కీలక ప్రసంగం చేశారు. తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. హమాస్, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే వారి లక్ష్యమని దుయ్యబట్టారు.













