గాజాలో ‘సంధి’ కిరణం..?
ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడితో పౌరులతో పాటు హమాస్ దిక్కుతోచని స్థితికి చేరినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ను ధీటుగా ఎదుర్కొెంటామని గంభీరవచనాలు పలికిన హమాస్.. ఇప్పుడు సంధి మంత్రం జపిస్తోంది. బంధీలను అడ్డం పెట్టుకుని, రాజీ బేరాలాడుతోంది. అయితే గతంలో ఇలాంటి బేరానికి అంగీకరించినందుకు వచ్చిన పర్యవసానాలు ఇంకా ఇజ్రాయెలీ ప్రభుత్వం మదిలో ఉండడంతో…. బంధీలందరినీ వదిలేంతవరకూ పోరాడుతామంటూ తేల్చి చెబుతోంది.
రోజురోజుకూ ఇజ్రాయెల్ దాడులు పెరిగిపోతున్నాయి. హమాస్ బలం తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లీడర్లను టార్గెట్ చేసి మరీ హతమారుస్తోంది ఇజ్రాయెలీ రక్షణ దళాలు. హమాస్ బలంగా చెప్పుకునే గాజా భూగర్భ సొరంగాలను సైతం అణువణువూ శోధిస్తోంది. వాటిని మూసివేయడం, పేల్చేయడం, లోపలున్నవారికి ఎలాంటి సరఫరా జరగకుండా చూస్తుండడంతో… హమాస్ నేతలకు దిక్కుతోచడం లేదు. దీంతో ఎలాగైనా సరే యుద్ధవిరామం, లేదంటే సంధికి ప్రయత్నిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నేపథ్యంలో రెండింటి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా నుంచి వెలువడిన ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన హమాస్ మిలిటెంట్లు రెండు వందల మందికి పైగా తమ చెరలో బంధించారు. వారి విడుదల కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క వారిని విడిచిపెట్టేవరకూ దాడులు ఆపమంటూ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ‘గతంలో కంటే దగ్గరగా ఉన్నాం’ అని ఒప్పందాన్ని ఉద్దేశించి అగ్రదేశం స్పందించింది. ఈ నేపథ్యంలోనే హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా నుంచి కూడా ఇదే తరహా స్పందన వెలువడింది. ‘ఇజ్రాయెల్‌తో సంధికి చేరువవుతున్నాం’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
గాజా వైపు నుంచి హమాస్ రెండు రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఆ రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. బందీల కుటుంబాలతో మాట్లాడారు. ‘బందీలను విడిపించేవరకు మేం వెనక్కితగ్గం. అది ప్రభుత్వం బాధ్యత. వారి విడుదల పవిత్రమైన, అత్యున్నత మిషన్’ అని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.













