ఆపరేషన్ ‘గాజా’
గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రిపరేషన్‌కు ఇజ్రాయెల్ దళాలు సిద్ధమయ్యాయి. అనుమతిస్తే చాలు గాజా బోర్డర్లో ఎంటరవుతామంటున్నాయి. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలను ఉత్తర గాజా ఖాళీ చేసి.. దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఐడీఎఫ్ బలగాలు హెచ్చరించాయి. కారిడార్‌ను ఏర్పాటు చేశారు. దీంతో లక్షల మంది వలస బాట పట్టారు. గాజాను ఆక్రమించడం సాధ్యమయినా కూడా… ఆపరేషన్ హమాస్ విజయవంతమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు .. పౌరులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని హమాస్ ఉగ్రవాదులు భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే పౌరుల వాహనాలను హమాస్ ఉగ్రవాదులు అడ్డుకుంటున్న ఫొటోలను ఇజ్రాయెల్ రక్షణదళాలు ట్విట్టర్లో పోస్ట్ చేశాయి.
ఇజ్రాయెల్ గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ సిద్ధమైన సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక కామెంట్లు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు జోబైడెన్. ఒక వేళ ఉంటే మాత్రం అది అతిపెద్ద పొరబాటు అవుతుందని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారాయన. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు.
గాజాను సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్ తన ఆధీనంలో ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు బైడెన్. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలో అక్కడి పాలన నిర్వహించాలని సూచించారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. గాజాలో ఉన్న అతివాద హమాస్ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవన్నారు బైడెన్.
అంటే గాజాపై దాడికి సహకరించడంతో పాటు ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉన్నప్పటికీ.. ఆపరేషన్ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వెనక్కురావాలని అమెరికా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఇంకా గాజాలోనే ఇజ్రాయెల్ సైన్యం తిష్టవేస్తే…. ఇస్లామిక్ దేశాల నుంచి ప్రతిఘటన ఎదురుకావొచ్చు. దీనికి తోడు హిజ్బుల్లాను ఇరాన్ ఎగదోస్తోంది. వాటిని తట్టుకుంటూ అక్కడ ఎక్కువకాలం ఉండే పరిస్థితి లేదన్నది అగ్రరాజ్యం భావనగా కనిపిస్తోంది.













