కాంగ్రెస్ ఖాతాల ఫ్రీజ్ పై…
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ అకౌంట్ల ఫ్రీజ్ అంశం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికల సమయంలో తమ పార్టీకి చెందిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ నిలిపివేసినట్లు.. ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు.. పన్ను కట్టలేదనే కారణంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందన్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిన గంట తర్వాత.. అధికారులు మళ్లీ ఖాతాలను పునురద్ధరించారు. ఈ అంశంపై ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేయడం వల్ల ఉపశమనం లభించింది.
ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం : అజయ్ మాకెన్
కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ కావడంతో.. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మండిపడ్డారు. కనీసం విద్యుత్ బిల్లులు, సిబ్బందికి కూడా జీతం ఇవ్వడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదంటూ వాపోయారు. రూ.210 కోట్లు పన్ను చెల్లించలేదనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆరోపించారు. 2018 -19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ అకౌంట్లను సమర్పించిందని.. కేవలం దీనికే అకౌంట్లు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండానే చేస్తున్నారని.. అధికార పార్టీ.. విపక్ష పార్టీని లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యపై తాము న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు.
నియంతృత్వ తీరును ఎండగడతాం : ఖర్గే
మరోవైపు దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వాడుతారు.. కానీ మేం క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధుల్ని మాత్రం అడ్డుకుంటారని మండిపడ్డారు. అందుకే నేను భవిష్యత్తులో ఎన్నికలు జరగవని గతంలోనే చెప్పానని అన్నారు. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను అలాగే దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగతామన్నారు ఖర్గే.మాకు డబ్బు బలం కాదు ప్రజాబలం ఉంది.
కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: రాహుల్ గాంధీ
మోడీ, షా.. కాంగ్రెస్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదాయ పన్ను శాఖ వెనుక మోడీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మోడీకి తాము భయపడమని.. కాంగ్రెస్‌కు డబ్బు బలం లేదని.. ప్రజా బలం మాత్రమే ఉందని అన్నారు. నియంతృత్వ పాలను ముందు తాము ఎన్నడు తలవంచలేదని.. ఎప్పటికీ తలవంచమన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడుతారని స్పష్టం చేశారు. మరోవైపు..ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థలున్నప్పటికీ…. ఈ దారుణం చోటు చేసుకోవడమేంటన్నారు. అన్నివ్యవస్థలు చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.













