స్వతంత్ర విధానం..! బాధిత పక్షం..!
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రదాడిని శసభిషలు లేకుండా వెంటనే ఖండించింది భారత్. అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రదాని నెతన్యాహుకు ఫోన్ చేసి.. అండగా ఉంటామని ప్రకటించారు భారత ప్రధాని మోడీ. ఇలాంటి దాడులు ఎప్పుడు జరిగినా తాము దాన్ని ఖండిస్తూ వస్తున్నామని చెప్పారు. దీంతో భారత్.. అరబ్ దేశాలకు దూరం జరుగుతోందని ప్రచారం మొదలైంది. అయితే దాన్ని ఖండిస్తూ కౌంటరిచ్చారు భారత విదేశాంగమంత్రి జయశంకర్. తర్వాత ఇజ్రాయెల్.. గాజాపై యుద్ధం ప్రారంభించి నెలరోజులు దాటాయి. గాజా పౌరుల దాదాపు పదివేలమంది దాకా చనిపోయినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలోనూ ఇజ్రాయెల్ తీరుపై..ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇజ్రాయెల్ ను అగ్రరాజ్యం అమెరికా, కొన్ని యూరప్ దేశాలు వెనకేసుకొస్తున్నాయి. ఇక భారత దేశం తమకు మద్దతివ్వాలని పాలస్తీనా, ఇజ్రాయెల్ కోరుతున్నాయి. భారత్ మాత్రం జరుగుతున్న పరిణామాల ఆధారంగా.. తన విధానాన్ని వెల్లడిస్తూ వస్తోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నేరుగా ఖండించకున్నా.. బాధిత ప్రజలకు సహాయసామాగ్రిని పంపుతోంది. అయితే దాడులు తీవ్రమైన తరుణంలో.. గాజా పరిస్థితి దారుణంగా ఉందని.. దీన్ని ఆపేందుకు భారత్ ప్రయత్నించాలని పాలస్తీనా నేరుగానే అభ్యర్థించింది. మరోవైపు పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్ మెంట్ పేరుతో కొంతకాలం ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓవైపు దీన్ని ఖండిస్తున్నట్లు చెబుతూనే అమెరికా.. ఇజ్రాయెల్ కు తన మద్దతు కొనసాగిస్తోంది. అయితే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. అమెరికా, కెనడా సహా 8 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఆక్రమిత పాలస్తీనా భూభాగం ఈస్ట్ జెరూసలేం, ఆక్రమిత సిరియన్ గోలాన్ హైట్స్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అమెరికా, కెనడా సహా ఏడు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. 18 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలంటూ ఇటీవల జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో పాలస్తీనాలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ అనాగరిక చర్యల ప్రస్తావన లేకపోవడంతో భారత్ అప్పట్లో వ్యతిరేకించింది. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. పాలస్తీనా సౌర్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఇదే సమయంలో అంతర్జాతీయ చట్టాలను అనుసరించి తీవ్రవాదంపై పోరాటం చేయాలని భారత్ పదేపదే చెబుతోంది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.













