ఓటింగ్ కు దూరం…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరాటం ఉధృతంగా సాగుతోంది. హమాస్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడిలో.. గాజావాసులు దుర్మరణం పాలవుతున్నారు. ఈ సందర్భంగా పలుదేశాలు.. ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతున్నాయి. గాజావాసుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ను కూకటివేళ్లతో పెకిలించేవరకూ తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతోంది.
గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. దానిలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ గైర్హాజరీకి కారణంగా కనిపిస్తోంది. మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐరాస అత్యవసర ప్రత్యేక సెషన్లో ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ‘పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం’ పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. 121 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 14 వ్యతిరేకించాయి. 44 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. భారత్‌తోపాటు కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి.
తీర్మానంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చెడును విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓటింగ్‌కు ముందు అమెరికా మద్దతుతో కెనడా తీర్మానానికి సవరణను ప్రతిపాదించింది. ‘అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని, పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎటువంటి షరతులు లేకుండా బందీలను వెంటనే విడుదల చేయాలి’ అని ఆ సవరణలో పేర్కొంది. ఆ సవరణ ప్రతిపాదనకు భారత్‌సహా 87 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 55 దేశాలు వ్యతిరేకించగా 23 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సవరణకు మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో పరిగణనలోకి తీసుకోలేదు.
భారత్ వివరణ
గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన చెందుతున్నామని, అదే సమయంలో ఉగ్రవాదంపై రాజీపడే ప్రశ్నే లేదని భారత్ స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై శనివారం ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ‘ఈ తీర్మానం హమాస్ మిలిటెంట్ల దాడులను ఖండించలేదు. మిగిలిన విషయాలనూ ప్రస్తావించలేదు. మిలిటెంట్ల దాడులను ఖండిస్తూ ప్రతిపాదించిన సవరణను ఆమోదించలేదు. అందుకే ఓటింగ్‌కు గైర్హాజరయ్యాం’ అని పేర్కొన్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై తమ ఆందోళనలను గట్టిగా తెలియజేశామని వివరించాయి. ‘గాజాలో మరణాలు మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. మానవతా సంక్షోభాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలి. మానవతా సాయం కోసం, ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాం’ అని ఓటింగ్‌పై ఇచ్చిన వివరణలో ఐక్యరాజ్యసమితిలో భారత ఉప ప్రతినిధి యోజనా పటేల్ తెలిపారు.t













