Khaleda Zia: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు న్యుమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధరించారు. ఆ తర్వాత వేగంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రు ప్రార్థనల తర్వాత ఆమె తుదిశ్వాస విడిచారు.
ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. ఆమె 1991 – 1996, 2001 – 2006 మధ్య పదేళ్లపాటు ప్రధానిగా పని చేశారు. బంగ్లాదేశ్‌లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థను ఆమె తొలుత ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల 17 ఏళ్ల తర్వాత ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేసియాలో కన్నుమూశారు.
1945లో వ్యాపారవేత్త సికందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదాజియా.. 1960లో జియావుర్ రెహమాన్‌ను వివాహం చేసుకొన్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్‌పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలిదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత పదేళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.






