కూటమిగా బీజేపీ, జేడీఎస్..?
కర్నాటక రాష్ట్రంలో మళ్లీ పొత్తు రాజకీయాలు ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జేడీఎస్ ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుదామని భావించిన జేడీఎస్.. తర్వాతి పరిణామాలతో సైలెంట్ అయింది. మళ్లీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు, బదిలీల దందా వంటి అంశాలపై ముప్పేట దాడికి చేతులు కలపాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బదిలీల దందాకు సంబంధించి మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి చేస్తున్న ఆరోపణలను తాను గట్టిగా సమర్థిస్తున్నట్టు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. కుమారస్వామి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని కితాబునిచ్చారు. అంతకుముందు అసెంబ్లీ లాంజ్ లో మాట్లాడిన కుమారస్వామి… కాంగ్రెస్ అధికారంలో వచ్చిననాటి నుంచి నెలన్నర రోజులుగా అడ్డగోలుగా దోపిడీ సాగుతోందన్నారు. బదిలీల దందా తారస్థాయికి చేరిందన్నారు. లంచాలు లేనిదే పోస్టింగ్‌లు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి నివాసమే ఈ దందాకు కేంద్రబిందువుగా ఉందన్నారు. తనవద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకునే దమ్ముంటే అందచేస్తానని ఆయన ప్రకటించారు.
తమపై నిరాధార ఆరోపణలు చేసేముందు ఆధారాలు ఉంటే లోకాయుక్తకు సమర్పించాలంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాల్ చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఘాటుగా స్పందించారు. తమతో కలసి పోరాడేందుకు సుముఖత వ్యక్తం చేసిన మాజీ సీఎం యడియూరప్పకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు గమనిస్తుంటే రానున్న రోజుల్లో ఉమ్మడిగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు సాగించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారెంటీ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. గ్యారెంటీ పథకాల విషయంలో ప్రజలకు జరుగుతున్న మోసానికి నిరసనగా బెంగళూరు ఫ్రీడం పార్కులో బీజేపీ ప్రదర్శన నిర్వహించింది. మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, మాజీ స్పీకర్ కాగేరితోపాటు పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మతమార్పిడి నియంత్రణ చట్టం, గోవధ నిషేధ చట్టాలను రద్దు చేసే ఆలోచన మానుకోవాలంటూ బీజేపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు.













