ఆగస్టులో ట్రంప్, కమలా బిగ్ డిబేట్..
బైడన్ స్థానంలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ రావడంతో… అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కమలా బృందానికి .. సీనియర్లు సైతం మద్దతుగా నిలవడం.. డెమొక్రాట్ల శిబిరంలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. మరోవైపు.. కాస్త వెనకబడ్డారన్న ప్రచారంతో ట్రంప్ శిబిరం అప్రమత్తమైంది. కమలా దూకుడుతో ట్రంప్ సైతం వ్యూహాలు మారుస్తున్నారు. బైడన్ పై ఎలా అయితే వాదంలో విజయం సాధించారో.. కమలాతో డిబేట్ లో సైతం అలాంటి ఫలితం కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నారు.
ట్రంప్ కు సాయంగా తులసీ గబ్బర్డ్…?
అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ త్వరలోనే ఒకే వేదికపై ముఖాముఖిగా తలపడనున్నారు. వచ్చే నెలలో వీరిద్దరూ తొలి డిబేట్లో పాల్గొంటారు. ఈ సంవాదానికి సిద్ధమవుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌ను ఎదుర్కొనేందుకు ఓ మహిళ సాయం తీసుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. డెమోక్రటిక్ పార్టీ మాజీ నాయకురాలు, భారత సంతతి నేత తులసీ గబ్బర్డ్. డిబేట్ కోసం ప్రాక్టీస్ చేస్తోన్న ట్రంప్ ఈ మేరకు ఆమె నుంచి సూచనలు, సలహాలను అందుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది.
ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్లో ట్రంప్ ప్రాక్టీస్ చేస్తుండగా… ఇందులో తులసీ కూడా పాల్గొన్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లియావిట్ ధ్రువీకరించినట్లు సదరు కథనం వెల్లడించింది. ‘‘జో బైడెన్‌తో జరిగిన చర్చతోనే రాజకీయ చరిత్రలో ఉత్తమ డిబేటర్‌గా ట్రంప్ తనను తాను నిరూపించుకున్నారు. సంవాదాలకు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. కాకపోతే ఈసారి ఓ మహిళను ఎదుర్కోబోతున్నారు. విధానపరమైన విషయాలతో పాటు మరిన్ని అంశాలపై ఆయన దృష్టిపెడుతున్నారు. ఈ క్రమంలోనే తులసీ గబ్బర్డ్ లాంటి నేతలతో ఆయన సమావేశమవుతున్నారు’’ అని కరోలిన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
డెమోక్రటిక్ పార్టీ తరఫున కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేసిన తులసి.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వ రేసులో పోటీపడ్డారు. అదే రేసులో కమలా హారిస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే 2019 జులైలో వీరిద్దరూ ప్రైమరీ డిబేట్లో పాల్గొనగా ఆ సమయంలో హారిస్‌పై తులసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ చర్చ జరిగిన కొన్ని రోజులకే హారిస్ రేసు నుంచి వైదొలిగారు. కొన్ని నెలల తర్వాత వెనక్కి తగ్గిన తులసీ 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడారు.
తాజా ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు తులసి. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్, కమలా హారిస్ వచ్చే నెల 10న ఏబీసీ టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొననున్నారు. అంతకుముందు జో బైడెన్‌తో సంవాదంలో పాల్గొనగా..అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ డిబేట్ తర్వాతే బైడెన్‌పై సొంత పార్టీ నుంచి వ్యతిరేకత అధికమయ్యింది. ఆయన అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు..






