అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బైడెన్ వర్సెస్ ట్రంప్..
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడనున్నారు. సూపర్ ట్యూస్ డే ఫైట్ లో ఇద్దరు ప్రత్యర్థులపై భారీ మెజార్టీ సాధించారు. ముఖ్యంగా రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ఉన్న ట్రంప్.. టెక్సాస్, కాలిఫోర్నియా సహా “సూపర్ ట్యూస్డే” రాష్ట్రాలలో జరిగిన మొదటి 13 ప్రైమరీ ఎన్నికలలో విజయం సాధించారు. అయితే వెర్మోంట్లో నిక్కీ హేలీ చేతిలో పరాజయం పాలయ్యారు.
అలబామా, అలాస్కా, అర్కాన్సాస్, కొలరాడో, కాలిఫోర్నియా, మైనే, మసాచుసెట్స్, మిన్నెసోటా, నార్త్ కరోలినా, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్ మరియు వర్జీనియాలు.. ట్రంప్ కు మద్దతుగా నిలిచాయి. దీంతో తన ట్రూత్ సోషల్ సైట్లో ఆయా రాష్ట్రాల్లోని రిపబ్లికన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్. గత ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు నిరాకరిస్తూ వచ్చిన ట్రంప్.. ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి తోడు పార్టీలో సైతం ట్రంప్ కు ధీటైన అభ్యర్థి లేకపోవడంతో… ఈసారి ట్రంప్ అధ్యక్షబరిలో పార్టీ తరపున నిలవడం ఖాయమైందని చెప్పొచ్చు.
ఇక…‘సూపర్ ట్యూస్డే ప్రైమరీల’ పోరులో నిక్కీహేలి దారుణంగా ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా.. హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ నకు పోటీగా.. హేలీ, వివేక్ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే, ప్రైమరీలు మొదలైన నాటినుంచే మాజీ అధ్యక్షుడు ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు.
డెమొక్రాటిక్ నామినేషన్ పోటీలో, ఊహించినట్లుగా, బిడెన్ US నెట్‌వర్క్‌లుగా పిలవబడే 14 రాష్ట్రాలను గెలుచుకున్నాడు, దీంతో అధికార డెమోక్రాట్ల తరఫున బైడెన్ ముందంజలోనే ఉన్నారు. అయితే, లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్ పొందడానికి ట్రంప్ ఈనెల 12 వరకు, బైడెన్ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.






