‘యుద్ధ విరామం’ డిమాండ్లు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరపోరు సాగుతోంది. ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడుల కారణంగా గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. వేలాది మంది ప్రజలు చనిపోతుండడంతో.. దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాయి. బొలీవియా లాంటి దేశాలు ఇజ్రాయెల్ తో సంబంధాల్ని సైతం తెంచుకుంటున్నాయి. ఆఖరుకు..అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు.
మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. అక్కడ ఓ వ్యక్తి.. ‘మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలి’ అని అధ్యక్షుడిని ఉద్దేశించి బిగ్గరగా కేకలు వేశారు. దానికి బైడెన్ బదులిచ్చారు. ‘విరామం అవసరమని భావిస్తున్నాను. బందీలను బయటకు తీసుకురావడానికి సమయం ఇవ్వాలి’ అని అన్నారు.
గాజాలో ప్రజా నివాసాల మధ్య హమాస్ రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధ డిపోలు, సామగ్రి నిల్వ చేసింది. దీనికి తోడు గాజా అంతర్భాగంలో నిర్మించిన సొరంగాలు…. ఐడీఎఫ్ దళాలకు ప్రాణసంకటంలా మారాయి. హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూ, సొరంగాల్లోకి జారుకుంటున్నారు. దీంతో హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేలా అత్యంత పకడ్బందీగా వేట సాగిస్తోంది ఐడీఎఫ్, కానీ ఈ భీకర యుద్ధంలో పొరపాటు బాంబింగ్స్ తో వేలాది మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. పోనీ ప్రపంచదేశాల విజ్ఞప్తి మేరకు పోరాటానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తే… మళ్లీ హమాస్ బలోపేతమవుతుందన్న ఆందోళన ఇజ్రాయెల్ లో ఉంది. అందుకే యుద్ధానికి విరామం ప్రకటించే పరిస్థితే లేదంటోంది ఇజ్రాయెల్.
తమదేశాల్లో గాజావాసులకు మద్దతుగా ఆందోళనలు వెల్లువెత్తుతుండడంతో.. అరబ్ దేశాలు సైతం ఇజ్రాయెల్ కు దూరం జరుగుతున్నాయి. ఇరాన్, లెబనాన్ లాంటి దేశాలైతే.. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే యుద్ధం మరింత విస్తృతమవుతుందని హెచ్చరిస్తున్నాయి. అయితే వాటన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. హమాస్ అన్న పదం భూమ్మీద లేకుండా చేస్తామంటోంది.గాజా నగరంపై జరుపుతోన్న దాడుల్ని ‘బాధాకరమైన భారీ మూల్యం’ అని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంగీకరించారు. కానీ, అది అవసరమని సమర్థించుకున్నారు. ‘మేం యుద్ధం మధ్యలో ఉన్నాం. ఇది సుదీర్ఘమైన పోరాటం. చివరివరకు ఇది కొనసాగుతుంది’ అని వెల్లడించారు.













